ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

చెలి నీవెవరు


ముందుమాట
"చెలి నీ వెవరు" అనే కవితా సంపుటి నిశీధివేళ
ఒంటరిగా నేను స్వప్నంలో విహరిస్తుంటే మేలి జలతారు ముసుగులో తాను తారసపడి నాతో
నడుస్తూ ఎన్నో ఊసులు చెబుతూ ఒంటరి తనాన్ని దూరంచేస్తూ నేనున్నానని బాస చేసి ప్రాతః
సమయాన నన్ను నిద్రలేపి మాయమయ్యేది. తన మాటల్లోని భావాలను తన సుందర రూపాన్ని గుర్తు చేసుకుంటూ అరుణోదయాన అక్షరరూపం కల్పిస్తూ తనను కవితల్లో చూసుకుని మురిసిపోతూ నా దినచర్యను కొనసాగిస్తూ రాత్రి ఎప్పడౌతుందా అని ఎదురుచూస్తూ కనిపించని మనిషిని అన్వేషిస్తూ ఈ కవితా సంపుటిని వ్రాయటం జరిగింది.
ఇట్లు,
మీ యేటూరి మురళీకృష్ణ కుమార్
**********************************************
నేనెవరో తెలుసా
పారే సెలయేరు నడుగు
పండు వెన్నెల నడుగు
చల్లగాలి నడుగు
పరవశించే ప్రకృతి నడుగు
గానానికి మైమరచిన గోవుల నడుగు
గోవర్ధనగిరి నడుగు
ఆరాధించే గోపికల నడుగు
నన్ను ప్రేమించిన రాధ నడుగు
అందరి ఆరాధ్య దేవుడిని నేను
 మీ మురళీ కృష్ణుడిని నేను
*****************************
చెలీ నీవెవరు ?
నీ మోము చూస్తే
పున్నమి నాటి చంద్రుడ్ని తలపిస్తోంది
నీ నవ్వులోని స్వచ్చత చూస్తే
పాలకడలిలోని నిర్మలత్వం కనిపిస్తోంది
నీ మాటల జోరు వింటే
తుమ్మెదల ఝూంకారంలా వినిపిస్తోంది
నీ నుదుటిపై స్వేద బిందువులు చూస్తే
మంచి ముత్యాల్లా మెరుస్తున్నాయి
నీ నల్లని కురుల సోయగం చూస్తే
నల్లని త్రాచు పాములా కనిపిస్తోంది
నీ కురుల నుండి జాలువారు నీటిని చూస్తే
నింగి నుండి నేలను చేరే చిరుజల్లలా కనిపిస్తున్నాయి
గాలికి కదలాడు నీ ముంగురులు చూస్తుంటే
ఆకాశంలో మేఘాలు కదలాడుతున్నట్లున్నాయి
నీలోని ఉచ్ఛ్వాస నిశ్వాసలుచూస్తే
ప్రచండుడి గ్రీష్మ తాపం కనిపిస్తోంది
నీలోని ప్రశాంతతను చూస్తే
సంద్రంలోని నిశ్చలత్వం కనిపిస్తోంది
నీలోని కోపతాపాలను చూస్తే
అగ్నిపర్వతంలోని లావాను తలపిస్తోంది
నీ నడకలోని హొయలు చూస్తే
రాజ హంసను తలపిస్తోంది
నీ పాద విన్యాసం చూస్తే
నయాగర జలపాత  హోరు కనిపిస్తోంది   
దివినుండి భువికి వచ్చిన అప్సరసవా ?
పాతాళం నుంచి పుడమికి వచ్చిన నాగకన్యవా ?
సాగరం నుంచి ధరణికి వచ్చిన సాగరకన్యవా ?
బ్రహ్మ సృష్టించిన మానవ కాంతవా ?
కంటికి కనిపిస్తూ అందనంత దూరానవున్న
చెలీ నీవెవరు.?
*******************************
సఖియా
పసుపు వన్నె వర్చస్సుతో
నుదుట శింగారు తిలకంతో
కళ్ళకు ఐటెక్స్ కాటుకతో
చెవులకు వ్రేలాడే జూకాలతో
ముక్కుకు ముక్కెరతో
ముక్కుపై దర్జాగా కూర్చొని
నయనాలకు రక్షణనిస్తూ
సౌందర్యాన్ని పెంచిన కళ్ళజోడుతో
అందమైన మోముకు సింథాల్ పౌడర్ తో
పెదాలకు లిప్ స్టిక్ తో మెరుగులు దిద్దావు
కారుమబ్బులాంటి నీ కురులు
గాలిలో విహరించే విహంగాల వలె
స్వేచ్చగా వీపుపై కదలాడుతు
ఆ కురుల కొనల నుండి జాలువారే నీరు
మంచు బిందువులులా నేలను చేరుతూ
భూదేవి  తాపాన్ని చల్లారుస్తున్నాయి
నల్లని మబ్బుల నడుమ ఒదిగిన చంద్రునిలా
నీకురులలో ఒదిగిన మల్లెలమాల
నీకు మరింత శోభను పెంచాయి
శంఖంలాంటి కంఠంలో
మంచి ముత్యాల హారం కదలాడుతోంది
ఆకాశాన్ని చీరగా నేసి
నక్షత్రాలను తళుకులుగా అల్లి
రూపొందించిన చీరకు
నీవు కట్టడం వలన అందం వచ్చింది 
నింగిలోని అప్సరస నేలను చేరినట్లైంది
అంబరంలో మెరిసిన మెరుపులు
ధరిత్రిపై నీ రాకను తెలియ జేసాయి సభీ !
**********************************
మెరుపు తీగ
పాప చెవికి లోలాకులు
అధరాలు మాగిన దొండపండ్లు
చెక్కిళ్ళు పలకమారిన మామిడిపండ్లు
నయనాలు మిణుగురు దీపాలు
మోము ఎర్రనైన సిమ్లా యాపిల్
మెడలో మంచు బిందువుల హారం
కురులు దట్టమైన కారుమబ్బులు
జడలో మల్లెల గుబాళింపులు
నవ్వు సరిగమల గానం
మాటలు నయాగర జలపాత జోరు
తనువు సుగంధాల నిధి
మనసు పురివిప్పిన మయూరం
నీవు కట్టిన మెరుపుల చీర
నింగిలోని ఇంద్ర ధనుస్సు లా    
కళ్ళకు కనువిందు చేసింది  
నీవల్ల చీరకు అందం వచ్చిందా ?
చీర వల్ల నీకు అందం పెరిగిందా ?
సౌందర్యమా ఆమెకు దాసోహమయ్యావా ?
సౌందర్యమా నిన్ను ఆమెలో అన్వేషించనా?
***********************
సాగసు చూడతరమా
నిర్మలమైన మోముతో
పండిన చెర్రి పండులాంటి పెదాలతో
మాగిన టమాటా లాంటి చెక్కిళ్ళతో
బంగారు వన్నె వంటి వర్చస్సుతో
కారు మబ్బు లాంటి శిరోజాలతో
నక్షత్రాల్లాంటి చక్షువులతో
కోటేరు లాంటి ముక్కుతో
కంటికి ఐటెక్స్ కాటుకతో
నుదుట సింగారు తిలకంతో
చందనా శారీతో, బొమ్మనా బ్లౌజుతో
లేత పద్మాలవంటి పాదాలతో
అరమోడ్పు కన్నులతో
శయనించిన తీరుచూసి
మనసు గాడితప్పి, ప్రతిమలా నిలిచి పోయాను
అలారం శబ్దంతో కళ్ళు తెరిచాను
వాస్తవం వెక్కిరించింది, కల చెదిరి పోయింది.

**************************
అవే కళ్ళు
కవ్విస్తున్నాయి రెండు కళ్ళు
వెంబడిస్తున్నాయి రెండు కళ్ళు
దోబూచులాడుతున్నాయి రెండు కళ్ళు
చూడగానే తప్పుకుంటున్నాయి రెండు కళ్ళు
మనసును వశపర్చుకున్నాయి రెండు కళ్ళు
వివశుడ్ని చేశాయి రెండు కళ్ళు
కాళ్ళను బందించాయి రెండు కళ్ళు
అంతు చిక్కలేదు ఎవరివో ఆ రెండు కళ్ళు
ప్రశ్నార్థకంగా మిగిలాయి ఆ రెండు కళ్ళు
జవాబు కోసం ఎదురు చూస్తున్నాయి నా రెండు కళ్ళు
************************
హృదయ స్పందన
నిన్ను చూసిన క్షణం
నా మనసు పడిన ఆరాటం
నాదగ్గరకు వస్తున్న క్షణం
నాగుండెల్లో పెరిగిన అలజడి
నాతో మాట్లాడిన ఆక్షణం
మాటలురాక మూగబోయిన నాస్వరం
నాతో గడిపిన క్షణమంతా
మర్చిపోలేని మధుర జ్ఞాపకం
నీవు దూరమౌతున్న ఈక్షణం
నాహృదయం పడిన ఆవేదన
నీవులేని క్షణం నుంచి
నీ రాకకోసం కొవ్వొత్తిలా కరిగిపోతున్న తనువు
నీ పిలుపు కోసం పరితపిస్తున్న కర్ణములు
నిన్ను చూడాలని రెప్ప వేయని నేత్రాలు
క్షణ క్షణం నాలో రగిలే అగ్నిజ్వాలలను
నీమాటల పన్నీటి జల్లుతో చల్లార్చు
నా హృదయ పూతోటలో నీవు విహరించవా! చెలీ!
*************************
ప్రేయసి నా ఊర్వశి
మూసి ఉన్న మది తలుపును
నీవు వచ్చి తెరిచావు
చీకట్లు నిండిన చక్షువులకు
నీవు కనిపించి వెలుగు నిచ్చావు  
మూలల్లో దాగిన ప్రేమను
నీ వాలు చూపులతో తట్టి లేపావు
నిద్రాణమైన మస్తిష్కాన్ని
నీ మాటలతో మేల్కొలిపావు
జడత్వం గల తనువుకు
నీ స్పర్శతో చైతన్య మిచ్చావు
నిరాశతో నిండిన జీవితానికి
నీ చిరునవ్వుతో ఆశలు నింపావు
నిశ్శబ్దం ఆవరించిన కర్ణములకు
నీ గానంతో పులకింప జేశావు
చలనం లేని కర, చరణములకు
నీ అందెల సవ్వడి తో నాట్యం నేర్పావు
ఇన్నిచ్చిన నీకు, నేనేమివ్వగలను సఖీ
నా స్వచ్చమైన మనస్సుతప్ప
అందుకుంటావా నాహస్తం
ఎదురు చూస్తుంటాను నీరాక కోసం

************************
రావే నా చెలియా
వయసు పెళ్ళికి తొందర పెడుతుంటే
మనసు ప్రేమకోసం పరితపిస్తుంటే
తనువు తమకంతో బరువెక్కుతుంటే
నయనాలు నీరాక కోసం రెప్ప వేయనంటే
కరములు నీచెక్కిళ్ళను అందుకోవాలని
పాదాలు నీ పాదాలతో కలసి నడవాలని
కర్ణములు నీ అమృత పలుకులు వినాలని
నీగురించి ఆలోచిస్తూ
ఉచ్చ్వాస నిశ్వాసాలు మర్చి పోయాను చెలి.
**********************
మువ్వల సవ్వడి
దూరంగా వినిపిస్తోంది మువ్వల సవ్వడి
లయ బద్దంగా  సాగుతోంది ఆ మువ్వల సవ్వడి
అనుగుణంగా సాగుతోంది నా హృదయ స్పందన
దగ్గరౌతున్న కొద్ది పెరుగుతోంది నా మస్తిష్కంలో అలజడి
వెతుకుతున్నవి ఎవరా అని కళ్ళు
చూడమని తొందర పెడుతోంది మనసు
చూసేదాక ఆగనంటున్నాయి కాళ్ళు
తీరా చూసే లోపు అమ్మ నిద్ర లేపింది
కళ్ళు  తెరిచే సరికి కల చెదిరి పోయింది
వెన్నెల్లో ఆడపిల్లలా మిగిలి పోయింది.
********************************
చెలీ సుకుమారి
నీ తమలపాకులాంటి చిత్తమునందు
రవ్వంత కాళీ చేసి నాకిస్తే చాలంట
నీ ప్రేమ పూజారి నవుత నీ కొప్పలో పువ్వునౌత
నీ నుదుట బొట్టునవుత నీ కళ్ళకు కాటుక నవుత
నీ మోముకు వ్రాసే పౌడరు నవుత
నీ అధరాలపై మెరిసే లిప్ స్టిక్ నవుత
నీ మెడలో ముత్యాల హారాన్నవత
నీ మేను కప్పే చీర నవుత
నీ కాళ్ళకు అందెల రవళి నవుత
నీకు ఎండ పడకుండ గొడుగు నవుత
నీకు చల్లదనాన్నిచ్చే వింజామరాన్నవుత
నీకు విశ్రాంతి నిచ్చే సోఫానవుత
నీకు దాహం తీర్చే మజా నవుత
నీకైనా తనువును పరుపుగా పరచి సున్నితమైన
నీ తనువుకు చక్కని నిద్ర నందిస్తా
*************************
ఊహా సుందరి
ఎవరీ మృదుకోమలి, ఎవరీ స్నిగ్ద మనోహర
సౌందర్యరాశి, ఎవరీ అపురూప లావణ్యవతి,
ఎవరీ కులుకుల నడకల వయ్యారి, ఎవరీ సుందరి
ఆహా సుందరీ నీ అందం నా డెందమును
తాకేనే  ఓహో సుందరీ
"ఇన్నాళ్ళ ఏ మబ్బుల్లో దాగున్నావే వెన్నెలగువ్వా"
నాకోసం దేవలోకం నుంచి బ్రహ్మపంపిన దేవకన్నెవా?
లేక భూలోకమందు జన్మించిన భూలోక సుందరివా !
లేక నాకోసం పూసిన పారిజాతానివా !
"ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమ గీతమో"
అప్సరసలు సైతం నీ అందం చూసి ఈర్ష్య చెందుతారే
నడకలోని హోయలు చూసి రాజహంస చిన్నబోదా
రవి వర్మకే అందని అందమే ఒకే ఒక అందానివో"
అవి కళ్ళా కలువ రేకులా, అవి చెక్కిళ్ళా గులాబి రేకులా
అవి అధరాలా మందార దళాలా,అవి పాదాలా పద్మదళాలా
అది నడుమా సన్నజాజితీగా
ఆహా!"ఎన్నెన్ని ఒంపులు ఎన్నెన్నిసొంపులు నాకున్నవేమో రెండే కన్నులు"
నా చీకటి హృదయంలోకి మెరుపులా తళుక్కున మెరిసి
మాయమయ్యావు అప్పటి నుంచి
" కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే
నా ఈ శూన్య జీవితంలోకి వస్తావని
చుక్కాని లేని నావకు చుక్కానివై ఆనంద సాగరంలో
ప్రయాణం చేయిస్తావని, మల్లెపందిరి నీడలో పండు వెన్నెల్లో
ఊసులాడతావని కలలు కంటున్నాను, నా కలలు నిజం చేస్తావని
"చేతిలోన చెయ్యేసి చెప్పెయ్యవా నన్నెన్నడు విడిపోనని"

*******************************************
ఇదే నా మొదటి ప్రేమ లేఖ
స్థలం : బొంబాయి,
తేది : 20శతాబ్దం.
హాయ్ చంద్రలేఖ ,
ప్రియమైన నీకు, మనసంతా నువ్వే అయ్యి ప్రేమతో నీకోసం వ్రాస్తున్న నా తొలి ప్రేమ లేఖ.
అనగనగా ఒకరోజు స్టూడెంట్ నెం.1లా, ముద్దమందారంలాపంచదార చిలకలా, గులాబి డ్రస్సులో, 16 యేళ్ళ వయస్సుతోనీ గర్ల్ ఫ్రెండ్స్ తో కలసి కాలేజి గేటుదాటి క్లాసు రూమ్ లోకి వెన్నెల్లోఆడపిల్లలా వచ్చి మాయమయ్యావు.
నిన్ను చూడాలని కలుసుకోవాలని క్షణక్షణం నా మనసులో చెలరేగే సంఘర్షణను అంతం చేసుకొని బాటసారిలా ఒంటరి పోరాటం చేస్తూ సీతాకోక చిలుకైన నిన్ను అన్వేషణ చేస్తూ దేవదాసునైనాను
            నీతో నామనసులోమాట హలో ఐ లవ్ యు రా అని చెప్పాలని వుంది. నువ్వు నేను, జరాసిక్ పార్క్లోకి అనకొండ, గాడ్జిల్లా టైటానిక్ ను చూసి తాజ్ మహల్లో కూర్చొని   ప్రేమసందేశం కబుర్లు వినాలని ప్రేమ పావురాల్లా మనమిద్దరం శ్రీరామ్, చిత్రాన్ని జనంతో చూసి ఖుషి చేసుకొని ఎగిరే పావురంలా శ్రీరాజరాజేశ్వరి కాఫీ విలాస్ క్లబ్లో వాలి కాఫీ తాగి ఇల్లు చేరుకోవాలని నా తల్లి దండ్రులకు అల్లరి పిల్లగా నిన్ను పరిచయం చేయాలని వారు కోడలుపిల్లగా అంగీకరించి తాంబూలాలు అందుకోవాలని పెళ్ళి పందిరిలో పెళ్ళిపీటలపై తాళిబొట్టు కట్టాలని తలంబ్రాలు పోయాలని నా అర్ధాంగిగా నా పచ్చని సంసారంలోకి ఆనందంగా అడుగు పెట్టాలని అరుణ కిరణాలకు ఆహ్వానం పలుకుతూ ముత్యాలముగ్గు వేస్తూ కోకిలలా ఆడుతూ పాడుతూ తొలిముద్దుతో సుస్వాగతం అంటూ ఇల్లాలిగా నన్ను నిద్ర లేపాలని సంతోషంగా మనం సకుటుంబ సపరివార సమేతంగా భద్రాచలంవెళ్ళిశ్రీరాములయ్యని దర్శించుకోవాలని మనీ లేకపోయిన మనసుంటేచాలు నువ్వే కావాలని అంటూ నీవంగీకరిస్తే,
మాయాబజారులాంటి మాఇంట్లో నాన్నజస్టిస్ చౌదరితో అమ్మ సతీసావిత్రితో అన్నయ్య మాష్టారు రాజాతో వదిన మేడమ్ రుక్మిణితో అక్క శ్రీదేవితో, బావ బాషాతో, మేనకోడలు అంజలితో నువ్వనాకు నచ్చావని, నిన్నేప్రేమిస్తున్నానని,నిన్నే పెళ్ళాడతానని భార్యా భర్తలమై ఈ ప్రేమాలయంలో అడుగు పెడతామని బద్రిలా జడ్జిమెంటుఇస్తాను.
ప్రేమలేఖ శుభలేఖగా మారాలని శుభలగ్నం నిర్ణయిస్తావని ఆశిస్తాను.

ఇట్లు
(శ్రామణి సుబ్రమణ్యం)
నీ ఆది.

***********************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శతక లక్షణాలు, శతక కవులు

 శతక లక్షణాలు 1.సంఖ్యానియమం(100 to 108) శతకం అనగా 100 పద్యాలు,త్రిశతి  200లపద్యాలు, పంచశతి  500ల పద్యాలు,సప్తశతి  700ల పద్యాలు  2. మకుట నియమం( ఏకపద, అర్థపాద, ఏకపాద, ద్విపాద మకుటాలు)  3. రస నియమం( భక్తి, వైరాగ్యం, నీతి, శృంగారం)  4. ముక్తక నియమం : ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావం ఉండటం  5.ఛందో నియమం : వృత్త, జాతి, ఉపజాతి ఛందస్సు 6. ఆత్మాశ్రయభావన నియమం  7. ఉదాహరణలతో  వివరించటం  పద్యాలను బట్టి శతకాలను 15 రకాలుగా వర్గీకరించారు .1) భక్తి 2) శృంగార 3) నీతి  4) వేదాంత 5) హాస్య 6) చారిత్రక 7) కథా  8)చాటు 9) జీవిత చారిత్రక 10) స్వీయ చరిత్ర  11) వ్యజ్య నిందాస్తుతి 12) సమస్యాత్మక  13) నిఘంటు 14) అనువాద15) అచ్చ తెలుగు                    * శతక కవులు * 1.యథావాక్కుల అన్నమయ్య : 12వ శతాబ్దం   సర్వేశ్వర శతకం, మకుటం : సర్వేశ్వర  2.పాల్కురికి సోమన : 13వ శతాబ్దం,  వృషాధిప శతకం, రచనలు : బసవ పురాణం, బసవోదాహరణం, పండితారాధ్య చరిత్రం  3.బద్దెన :13వ శతాబ్దం, సుమతీ...

దేశం - రాష్ట్రం - తెలుగు భాష ఔన్నత్యం

మన దేశం భారత దేశం మన దేశం శత్రు దుర్భేద్యమైనది భారతదేశం అలీన రధసారధి మన దేశం శాంతి సమానత్వ సౌభ్రాతృత్వం గలది మన దేశం లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం మన దేశం భిన్నత్వంలో ఏకత్వ స్వరూపమే మన దేశం చారిత్రక కట్టడాల నిలయం మన దేశం కళలకు పుట్టినిల్లు మన దేశం నవరసాల మేళవింపు మన దేశం పున్నమి నాటి చంద్రుని వంటిది మనదేశం మన దేశం భారత దేశం ------------------------------------------------------ ఈ దేశం మనది భారతదేశ దాశ్య శృంఖలాలు తొలగించడానికి సీతారామరాజు ఝాన్సీ లక్ష్మీబాయి ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి భగత్ సింగ్ నేతాజీ వంటి వారు ఆయుధాలు ధరించి విడివిడిగా యుద్ధాలు చేసి ప్రాణాలు విడిచారు కొందరు మితవాదులు కరపత్రాల ద్వారా నినాదాల ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినా ఫలితం శూన్యం లాల్ బాల్ పాల్ వంటి అతివాదులు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు కారణం విడివిడిగా పోరాడటమే ఆయుధం ధరించిన వాడు ఆయుధంతోనే మరణిస్తాడనే విషయం గ్రహించిన గాంధీజీ సత్యం అహింస శాంతి అనే ఆయుధాలు ధరించి డూ ఆర్ డై అనే నినాదంతో ప్రజలందరిలో స్వాతంత్య్ర కాంక్షను రగుల్కోపి ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపండంటు ఒకే ...