ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ధ్రువతారలు


షిర్డీ సాయి

మీ నామము మధురం
మీ మాటలే వేదాంత సారం
మీ చూపులే మాకు కారుణ
మీ ధుని సర్వరోగ నివారిణి
మీరు నడిచేది జ్ఞానమార్గం
మీరు నడిపించేది ముక్తి మార్గం 
మీ పాదాలచెంత గంగా యమునా 
మీ దీవెనలే మాకు శ్రీరామ రక్ష
మీ ధర్భారు నిండు ఖజానా 
ద్వారకామాయే మాకు శాంతి సౌధం 
షిర్డీయే మాకు పుణ్యక్షేత్రం
సాయియే సర్వ దేవతల స్వరూపం 
*************************** 

పుట్టపర్తి సాయి

ఈశ్వరమ్మ పెదవెంకమరాజులకు
1926లో నాల్గవ సంతానంగా
పాపప్రక్షాళన గావించుటకు
ధరిత్రిపై కారణజన్ముడిగా
సత్యనారాయణరాజు జన్మించినాడు
పాలబుగ్గల పసితనంనుంచే
ఆధ్యాత్మిక చింతనలో కాలంగడుపుతూ
14వ యేట జ్ఞానిగా మారి
భవబంధాలు త్యజించి
సత్యసాయిబాబాగా మారి
ఆధ్యాత్మిక గురువై
పుట్టపర్తిలో అడుగిడి
పుట్టపర్తిసాయియై
పుట్టపర్తిని పుణ్యక్షేత్రంగా మార్చి
ప్రేమతత్వమే విశ్వశాంతికి మూలమని
చాటిచెప్పిన అవతారమూర్తి
ఆనంద నిలయాన్ని నిర్మించి
మానవసేవయే మాధవసేవంటూ
ఆచరించి చూపిన యోగి
విద్యా సంస్థలు నెలకొల్పి
ప్రతిఇంటా అక్షర జ్యోతులు వెలిగించిన తేజోమయుడు
వైద్యశాలలను ప్రారంభించి
ఉచిత వైద్యసేవలందించిన
అపర ధన్వంతరి
నీళ్ళులేక అలమటిస్తున్న
ప్రజల దాహార్తి తీర్చి
కలియుగ భగీరధుడు
అన్నార్తుల ఆకలి మంటలు చల్లార్చి రంతిదేవుడు
గూడులేని నిరుపేదలకు
ఇళ్ళు నిర్మించిన విశ్వకర్మ
తన సూక్తులకుసేవలకు ప్రభావితులైన
ఎందరో దేశ విదేశీయులు సైతం
ఆయన శిష్యులుగాసేవకులుగా మారారు
అలాంటి సత్యసాయి
నాడు మనతోనే ఉన్నారు
నేడు మన మధ్యలో లేరు
నేను లేకున్నా కనిపించకున్నా
మీ హృదయమందిరంలో కొలువుంటూ
మీ నీడలా వెన్నంటే ఉంటానని
మార్గం చూపిన మానవతామూర్తికి
ఇదేనా అక్షర పుష్పాంజలి.
*******************************
గౌతమ బుద్దుడు
శాక్య వంశమునందున
మాయాదేవి శుద్దోధనులకు
లుంబినీవనములో
జన్మించాడు కారణజన్ముడు
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు
బాల్యము నుంచే సిద్దారుడు
భూతదయ కలవాడై
ఆధ్యాత్మిక చింతనాపరుడై
వైరాగ్యతత్త్వం మది నిండినవాడై
వృద్ధుడ్ని, రోగిని, శవాన్ని, సన్యాసిని గాంచి
కలత చెందిన మనస్కుడై
సుఖదు:ఖాలకు మూలం గ్రహించుటకై
మహాభినిష్క్రమణ గావించినవాడై
సర్వసంగ పరిత్యాగియై
సత్యాన్వేషణకై, సన్యాసియై
గయకు చేరిన గౌతముడు
 పిపిలి వృక్షం క్రింద ధ్యానం చేస్తూ
40వ రోజు జ్ఞానాన్ని పొంది
మహాజ్ఞానియై, సంబోధియై
బౌద్ధమతాన్ని స్థాపించి
సర్వానర్దాలకు  మూలం కోరికలని
కోరికలను అదుపు చెయ్యాలని
అష్టాంగ మార్గాలు ఆచరించాలని
ప్రవచించిన శాక్యముని
బుద్ధం శరణం గచ్ఛామి
ధర్మం శరణంగచ్ఛామి
సంఘం శరణం గచ్ఛామని
ప్రబోధించిన బుద్ధభగవానుడు
ఆసియా జ్యోతిగా, ప్రపంచ జ్యోతిగా
పూజలందుకుంటున్నదేవుడు
గౌతమ బుద్దుడు.
**************

మదర్ థెరిస్సా

యుగోస్లోవికియా నగరమందు
నికోలా, డ్రానిఫిల్ దంపతులకు జన్మించింది
దీనులమాతైన ఆగ్నస్ బొంషా బొజాక్షువా
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లుగా
బాల్యంనుంచే మానవసేవే మాధవసేవంటూ
ఐర్లాండ్ వెళ్ళి నన్ గా మారిన కారణజన్మురాలు
1928లో కలకత్తా నందు అడుగిడి
మోతీజీల్ మురికివాడలో వుంటూ
పిల్లల దుర్భర జీవితాలు చూసి చలించినదై
 ఇసుక నేలపై అక్షరాలు దిద్దిచ్చి
పిల్లల జీవితాల్లో జ్ఞానజ్యోతి వెలిగించిన ఉపాధ్యాయురాలు
శిశుసదననే అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి
పిల్లల ఆకలి బాధను తీర్చిన మాతృమూర్తి
శిశుభవన్ సంస్థను స్థాపించి
వీధిబాలల్ని, నెలలు నిండని పిల్లల్ని అక్కున జేర్చుకొని
వైద్యసేవలందించిన వైద్యురాలు
నిర్మల్ హృదయ్ సంస్థను నెలకొల్పి
ఆర్తులకు, రోగగ్రస్తులకు ఆశ్రయమిచ్చి
కరుణా ప్రేమలందించిన కరుణామయి
ప్రేమ నివాస్ సంస్థను ఏర్పరచి
కుష్ఠు రోగులకు రక్షణ కల్పించి
సేవలందించిన దయార్థహృదయురాలు
ప్రేమదాస్ సంస్థను ప్రారంభించి
చేతివృత్తిపనులను ప్రోత్సహించి
పేద ప్రజల బ్రతుకుల్లో వెలుగు నింపిన దేవతామూర్తి
మిషనరీ ఆఫ్ ఛారిటీ సంస్థను స్థాపించి
నిస్వార్థ సేవలందించిన త్యాగమూర్తి
తాను కొవ్వొత్తిలా కరుగుతూ, పేదలకు వెలుగునిస్తూ
ఎందరికో మార్గదర్శియైన ఆదర్శమూర్తి
పద్మశ్రీ, మెగసేసే, భారతరత్న అవార్డులను
భారతప్రభుత్వంచే స్వీకరించిన బెంగాల్ థెరిస్సా
నోబెల్ శాంతి బహుమతిని
ఐక్యరాజ్యసమితిచే అందుకున్న భారతముద్దుబిడ్డ
ఆర్థర్ ఆఫ్ మెరిట్ అనే పురస్కారాన్ని
ఇంగ్లాండ్ ప్రభుత్వంచే గ్రహించిన శాంతిదూత
ఎన్నో అవార్డులు, మరెన్నోరివార్డులువరించినా
చెలించని నిరాడంబురాలు మన మధర్ థెరిస్సా

************************************

రవీంద్రనాథ్ ఠాగూర్

కలకతా నగరమందు
దేవేంద్రనాథ్, శారదలకు జన్మించాడు
ఎన్నో పాటలు మరెన్నో కవితలు వ్రాసి
స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని
తన గానామృతం ద్వారా
గాంధీజీలో ఉద్యమ జీజాలు నాటించి
స్వాతంత్ర్యోద్యమ రధసారధిని గావించి
ప్రజల్లో సోదరభావం పెంచి
ఆసేతుహిమాచలమంతా
భారతావనిలో భాగమంటూ
జనగణమన గీతాన్ని ఆలపించాడు
బంగ్లాదేశ గీతమైన
అమర్ సోనార్ బాంగ్లా వ్రాసి పాడిన
కవి అయిన గాయకుడు
గీతాంజలి కవితా సంపుటిని వ్రాసి
భారతదేశంలోనే కాక
ఆసియా ఖండంలోనే ప్రధముడిగా
సాహిత్యరంగమందు
నోబెల్ బహుమతినందుకున్నాడు
శాంతి - నికేతన్, విశ్వభారతులనే
విద్యా సంస్థలు స్థాపించి
విద్యా వ్యాప్తికి కృషి చేసిన
విద్యాదాత
బ్రిటీష్ వారి దుశ్చర్యలకు నిరసనగా
సర్ బిరుదును త్యజించిన
భారత ముద్దుబిడ్డ
విశ్వకవిగా, గురుదేవ్ గా 
వేనోళ్ళకీర్తించబడ్డారు
మన రవీంద్రనాధ్ ఠాగూర్
*****************************

లూయీ బ్రెయిల్

ప్యారిస్ లోని క్రూవే గ్రామమందు
జన్మించాడు లిపి సృష్టికర్త
బుడి బుడి నడకలతో
ముద్దు ముద్దుమాటలతో
కాలం గడుపుతున్నలూయిూకి
అనుకరణ ప్రమాదమని
ఊహించని చిన్నారి బ్రెయిల్
మూడు వసంతాలు నిండకుండానే
చూపుకు దూరమై అంధుడైయ్యాడు
కళ్ళు లేకున్నా సూక్ష్మగ్రహణశక్తికలవాడై
తోబుట్టువుల అండతో
తండ్రి సహకారంతో ఓనమాలుదిద్ది
హవే అంధుల పాశాలలో చేరి
లైన్ టైప్ లిపి ద్వారా విద్యనేర్చి
చదివిన  పాశాలకే ఉపాధ్యాయుడయ్యాడు
ఇటాలియన్రోమన్మూన్ టైపులిపిలతో
పగలు పిల్లలకు పాఠాలు చెబుతున్నా
ఆ లిపులు లూయిూకి తృప్తినివ్వకపోవటంతో
రాత్రి సమయాన కొత్తలిపికై పరిశోధనలు చేస్తుండగా
బార్టియర్ 12 చుక్కల రాతి రాతపద్ధతి
లూయిూకి సమాధానంగా నిలిచింది
బార్టియర్ లిపిపై అవిశ్రాంతంగా ప్రయోగాలు చేసి
12 చుక్కల లిపిని చుక్కల లిపిగా మార్చి
ఈ లిపికి బ్రెయిలీ లిపి అని పేరు పెట్టి
అంధుల జీవితాల్లో వెలుగునింపి
వారి హృదయాల్లో దేవుడిగా నిలిచాడు
ఫ్రాన్స్ దేశం బ్రెయిలీ లిపిని అధికార లిపిగా గుర్తించి
తమ దేశముద్దు బిడ్డగా ప్రకటించింది
వైకల్యం శరీరానికే కానీ మేధస్సుకు కాదంటూ
నిరూపించిన మహా మనిషి లూయిూబ్రెయిల్
****************************

నార్మన్ బోర్లాగ్

అమెరికా నగరంలో
ఆయోవా ప్రాంతంలో
సామాన్య రైతు కుటుంబంలో
జన్మించాడు ఆపద్భాందవుడు
కొత్తవంగడాలు సృష్టించి
గోధుమ దిగుమతులు పెంచి
రైతుల్లో కొత్త ఆశలు నింపిన
హరిత విప్లవ పితామహుడు
కరువురక్కసిని తొలగించి
అన్నార్తుల ఆకలి మంటలు చల్లార్చి
దేశ ఆర్థిక ప్రగతిని చక్కదిద్దిన అన్నదాత
పద్మభూషణ్ అవార్డుతో
భారత ప్రభుత్వం సత్కరించింది
నోబెల్ శాంతి బహుమతితో
ప్రపంచ దేశాలన్నీ సన్మానించాయి
ప్రపంచ చరిత్రపుటల్లో
ఆయన కృషి అమూల్యం
ఆయన కీర్తి అజరామరం
ఆయనే నార్మన్ బోర్లాగ్

****************************

డాll బి.ఆర్.అంబేద్కర్

నిమ్నజాతి నందు
రాంజీ, భీమాబాయ్ దంపతులకు జన్మించి
అంటరాని వాడిలా జీవించి
వీధి దీపాల క్రింద విద్యనేర్చి
న్యాయశాస్త్రకోవిదుడై
రాజ్యాంగ రచనా సంఘ అధ్యక్షుడై
భారత రాజ్యాంగ పితామహుడిగా
న్యాయ శాస్త్ర సలహా మంత్రివర్యునిగా
రచయితగా, వక్తగా, నిత్యవిద్యార్థిగా
మూర్తీభవించిన మహామేధావి
నడిచి వస్తున్నగ్రంధాలయం ఆయన
కీర్తి కిరీటంలో కలికితురాయి భారతరత్న
ఎన్నో అవార్డులు మరెన్నోరివార్డులు
వరించిన భారత ముద్దు బిడ్డ
మన డా|| బి.ఆర్. అంబేద్కర్
*********************

గాంధీజీ

గుజరాత్లోని పోరుబందర్లో
కరమ్ చాంద్, పుత్లిబాయ్ దంపతులకు జన్మించి
లండన్లో బారిష్టర్ చదివి
తెల్లవారిచే ఛీత్కారాలు పొందాడు
అవమానాలు భరించలేక
మాతృభూమిలో అడుగుపెట్టి
భరతమాతకు పట్టిన దాస్యాన్ని
పారతంత్ర్యంలో మగ్గుతున్న ప్రజల్ని
చూసి చలించిన మనస్కుడై
స్వాతంత్ర్య సమరంలో పాల్గొని
సత్యం, ధర్మం, అహింసలనే ఆయుధాలతో
బ్రిటీష్ పరిపాలనకు వ్యతిరేకంగా
న్యాయ పోరాటాలను నిర్వహించి
వడివడి చకచక నడకలతో
ఉప్పు సత్యాగ్రహాన్ని నిర్వహించాడు
వాడియైన మాటల ఉపన్యాసాలతో
ప్రజలందరిని ఏకత్రాటిపై నడిపించి
చేయండి లేక చావండంటూ
క్విట్ ఇండియా ఉద్యమాన్ని నిర్వహించి
ఆంగ్లేయులగుండెల్లో రైళ్ళు పరిగెత్తించి
రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని
భారతదేశంలో అస్తమించే వరకు కృషి చేసి
భరతమాతకు దాస్యశృంఖలాలు తొలగించి
మాతృభూమికి స్వాతంత్ర్యాన్నిఅందించాడు
ఆయనే మన జాతిపిత మహాత్మాగాంధీజీ
***********************
తెనాలి రామకృష్ణ
కాళీమాతచే వరము పొంది
వికటకవి గా మారి
రాయలాస్థానమందు చేరి
అష్టదిగ్గజాలలో ఒకడిగా నిలిచి
కుమార భారతి గా పిలవబడ్డారు
కుంజరయూధంబు దోమ కుత్తుకజొచ్చెనను
సమస్యాపూరణమిచ్చిన భట్టుమూర్తికి
గంజాయి తాగితురకల సంజాతవంటు
సభయందు పరువు తీసాడు
ముదిమివయసందు ధూర్జటి
శృంగార కావ్యరచనల్లో దిట్టని
రాయలు వేనోళ్ళ కీర్తించగా
ఆలిని నిర్లక్ష్యం చేయుచు
వేశ్యాలోలుడంటు చులకన చేశాడు
గాడిదలకు సాష్టాంగ నమస్కారం చేసి
స్మార్తులంటే గిట్టని తాతాచార్యులకు
రాయల వద్ద గర్వభంగం చేశాడు
రాజుల సొమ్మురాళ్ళపాలు కాకూడదంటు
మూఢనమ్మకాల మీద ధ్వజమెత్తి
రాయలకు కనువిప్పు కలిగించాడు
వడ్రింగి వండిన భోజనంతో
నోరు చెడిపోయినట్లుగా
అల్పుని వల్ల రాజ్యపాలన చెడునని
రాయలకు జ్ఞానోదయం కలిగించాడు
కుల మార్పిడిని ప్రోత్సహించిన రాజుకు
కుక్క ఆవుగా మారదంటు
రాయలకు సున్నితంగా బుద్ధి చెప్పాడు
ఆయనే మన తెనాలి రామకృష్ణుడు
********************

సచిన్

"పదహారేళ్ల ప్రాయంలో
అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి
శత శతకాలను సాధించిన యోధుదు
అసాధ్యాన్ని సుసాధ్యం చేసి
వన్డేలలో 200 పరుగులు సాధించి
క్రికెటర్లందరిని ఔరాయనిపించిన ధీరుడు
40 సం.ల వయసులో కూడా
చిచ్చర పిడుగులా చెలరేగి
200 ల టెస్టులు ఆడి
34 వేలకుపైగా పరుగులు సాధించిన వీరుడు
2011లో  వరల్డ్ కప్పు చేబూని
ఎన్నో అవార్డులు మరెన్నో రివార్డులందుకుని
గిన్నిస్ బుక్ లో స్థానం పొంది
భారతరత్న అందుకున్న తొలిక్రీడాకారుడు
ఇండియన్ క్రికెటర్లకు పెద్దదిక్కుగా
ప్రపంచ క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచాడు
మన మాస్టర్ "బ్లాస్టర్ సచిన్"
********************************

మైకేల్ జాక్సన్

విశ్వాన్నిగానామృతంలో ఓలలాడించి
ప్రపంచాన్ని బ్రేక్ షేక్ లతో ఆడించి
ప్రజలందరి ఆరాధ్యగాయకుడిగా
అభిమానుల గుండెల్లో డాన్సు మాస్టర్ గా
ఎన్నో అవార్డులు పొందిన మేటి
పాప్ సంగీతానికి రారాజు
మన మైకేల్ జాక్సన్ మహరాజు
లక్షల గొంతులు కీర్తించాయి
జన్మభూమి తన అదృష్టానికి మురిసిపోయింది
నేడు ఆ గొంతు మూగబోయింది
ఆ పాద విన్యాసం ఆగి పోయింది
ఆ గుండెలయ తప్పింది
శ్వాస నిలచి పోయింది
శరీరం నిస్తేజమయ్యింది
అభిమానులు శోకసముద్రంలో మునిగిపోయారు
పుడమి తల్లి తన ముద్దుబిడ్డను పొత్తిళ్ళలో దాచుకుంది
పాప్ సంగీతం ఒక తారనుకోల్పోయింది
జయహెూ మైకేల్ నీ కీర్తి అజరామరం
**********************
ఉక్కు మనిషి  పటేల్ 
----------------------------------
అక్టోబర్ 31న
జవేరిభాయ్, లాడ్ బాయ్ దంపతులకు
గుజరాత్లోని నాడియార్ నందు జన్మించారు
మన భారత దేశ ఉక్కు మనిషి
ఇంగ్లాండ్లో బారిష్టర్ చదివినా
బ్రిటీషు వారికి వ్యతిరేకంగా
గాంధీజీ నాయకత్వంలో
స్వాతంత్య్ర సముపార్జనలో
తన వంతు కృషి చేశారు మన సర్ధార్
రాజ్యాంగ రచనలో ప్రధాన మైన
ప్రాధమిక హక్కుల కమిటీ చైర్మన్గా
దేశ విభజనానంతరం తలెత్తిన
అరాచకాలను అనేక సమస్యలను
ఒంటి చేత్తో చక్కదిద్దారు వల్లభాయ్
స్వాతంత్య్రానంతరం భారతదేశానికి
ఉప ప్రధానిగా, హోం మంత్రిగా అధికారం చేపట్టి
 సామ,దాన,బేధ,దండోపాయలతో
అనేక సంస్ధానాలను భారత్లో విలీనం చేసిన ధీరుడు మన పటేల్
ఆయన సేవలకు గాను 1991న
భారతరత్న అవార్డుతోను,
128మీటర్లతో 600అడుగుల ఎత్తుతో
ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం ఏర్పాటు
చేసి ఆయనకు మరింత గౌరవాన్ని ఇచ్చింది
మన భారత ప్రభుత్వం
ఆయనే మన భారత దేశ ఉక్కు మనిషి,
మన సర్ధార్ వల్లభాయ్ పటేల్

ఎ. బి. జె. అబ్దుల్ కలాం


అక్టోబర్ 15 1931న
తమిళనాడులోని రామేశ్వరమందు
ఒక పేదముస్లిం కుటుంబమందు
హాజీఅమ్మాళ్, జైనులాబీన్ దంపతులకు
ఉద్భవించింది ఒక ధృవతార
ఇంతై, ఇంతింతై, ఒటుడింతై అన్నట్లుగా
పేపరుబాయ్ నుంచి రాష్ట్రపతి దాకా ఎదిగి
దేశానికి ఎన్నో సేవలందించిన మహనీయుడు
బాల్టిక్ క్షిపణుల్లోనూ, పోఖ్రాన్ అణుపరీక్షల్లోనూ
ముఖ్య భూమిక వహించి భారత క్షిపణి పితామహుడయ్యాడు
శాస్త్రవేత్తగా రాష్ట్రపతిగా కవిగా వక్తగా రచయితగా
సంగీతకారుడిగా మార్గదర్శిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా
అందరి మన్ననలందుకున్న భారత ముద్దు బిడ్డ
బ్రహ్మ చార్యైన తొలి రాష్ట్రపతిగా
జలంతర్గామిలో ప్రవేశించిన తొలి రాష్ట్రపతిగా
సఖోయ్ ఫైటర్ జెట్లో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా
తనదంటూ ముద్ర వేసుకున్న మిస్సైల్ వీరుడు
పద్మ భూషణ్ పద్మ విభుషణ్ భారత రత్న వీరపురస్కార్ అవార్డులందుకున్న భారతీయుడు
ఎన్నో అవార్డులు మరెన్నో రివార్డులందుకున్నా
ఈసుమంత్తైనా గర్వంలేని మహర్షి
చెరగని చిరు దరహాసంతోనూ
అలుపెరగని బోధనా తృష్ణతోనూ
ఐ ఐ యమ్ షిల్లాంగ్ నందు బోధన గావిస్తూ
27.7.2015న తుదిశ్వాస విడిచిన కర్మర్షి
ఆయనే మనందరి అబ్దుల్ కలాం 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శతక లక్షణాలు, శతక కవులు

 శతక లక్షణాలు 1.సంఖ్యానియమం(100 to 108) శతకం అనగా 100 పద్యాలు,త్రిశతి  200లపద్యాలు, పంచశతి  500ల పద్యాలు,సప్తశతి  700ల పద్యాలు  2. మకుట నియమం( ఏకపద, అర్థపాద, ఏకపాద, ద్విపాద మకుటాలు)  3. రస నియమం( భక్తి, వైరాగ్యం, నీతి, శృంగారం)  4. ముక్తక నియమం : ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావం ఉండటం  5.ఛందో నియమం : వృత్త, జాతి, ఉపజాతి ఛందస్సు 6. ఆత్మాశ్రయభావన నియమం  7. ఉదాహరణలతో  వివరించటం  పద్యాలను బట్టి శతకాలను 15 రకాలుగా వర్గీకరించారు .1) భక్తి 2) శృంగార 3) నీతి  4) వేదాంత 5) హాస్య 6) చారిత్రక 7) కథా  8)చాటు 9) జీవిత చారిత్రక 10) స్వీయ చరిత్ర  11) వ్యజ్య నిందాస్తుతి 12) సమస్యాత్మక  13) నిఘంటు 14) అనువాద15) అచ్చ తెలుగు                    * శతక కవులు * 1.యథావాక్కుల అన్నమయ్య : 12వ శతాబ్దం   సర్వేశ్వర శతకం, మకుటం : సర్వేశ్వర  2.పాల్కురికి సోమన : 13వ శతాబ్దం,  వృషాధిప శతకం, రచనలు : బసవ పురాణం, బసవోదాహరణం, పండితారాధ్య చరిత్రం  3.బద్దెన :13వ శతాబ్దం, సుమతీ...

చెలి నీవెవరు

ముందుమాట " చెలి నీ వెవరు " అనే కవితా సంపుటి నిశీధివేళ ఒంటరిగా నేను స్వప్నంలో విహరిస్తుంటే మేలి జలతారు ముసుగులో తాను తారసపడి నాతో నడుస్తూ ఎన్నో ఊసులు చెబుతూ ఒంటరి తనాన్ని దూరంచేస్తూ నేనున్నానని బాస చేసి ప్రాతః సమయాన నన్ను నిద్రలేపి మాయమయ్యేది. తన మాటల్లోని భావాలను తన సుందర రూపాన్ని గుర్తు చేసుకుంటూ అరుణోదయాన అక్షరరూపం కల్పిస్తూ తనను కవితల్లో చూసుకుని మురిసిపోతూ నా దినచర్యను కొనసాగి స్తూ రాత్రి ఎప్పడౌతుందా అని ఎదురుచూస్తూ కనిపించని మనిషిని అన్వేషిస్తూ ఈ కవితా సంపుటిని వ్రాయటం జరిగింది. ఇట్లు , మీ యేటూరి మురళీకృష్ణ కుమార్ ********************************************** నేనెవరో తెలుసా పారే సెలయేరు నడుగు పండు వెన్నెల నడుగు చల్లగాలి నడుగు పరవశించే ప్రకృతి నడుగు గానానికి మైమరచిన గోవుల నడుగు గోవర్ధనగిరి నడుగు ఆరాధించే గోపికల నడుగు నన్ను ప్రేమించిన రాధ నడుగు అందరి ఆరాధ్య దేవుడిని నేను   మీ మురళీ కృష్ణుడిని నేను ***************************** చెలీ నీవెవరు ? నీ మోము చూస్తే పున్నమి నాటి చంద్రుడ్ని తలపిస్తోంది నీ నవ్వులోని స్...

దేశం - రాష్ట్రం - తెలుగు భాష ఔన్నత్యం

మన దేశం భారత దేశం మన దేశం శత్రు దుర్భేద్యమైనది భారతదేశం అలీన రధసారధి మన దేశం శాంతి సమానత్వ సౌభ్రాతృత్వం గలది మన దేశం లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం మన దేశం భిన్నత్వంలో ఏకత్వ స్వరూపమే మన దేశం చారిత్రక కట్టడాల నిలయం మన దేశం కళలకు పుట్టినిల్లు మన దేశం నవరసాల మేళవింపు మన దేశం పున్నమి నాటి చంద్రుని వంటిది మనదేశం మన దేశం భారత దేశం ------------------------------------------------------ ఈ దేశం మనది భారతదేశ దాశ్య శృంఖలాలు తొలగించడానికి సీతారామరాజు ఝాన్సీ లక్ష్మీబాయి ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి భగత్ సింగ్ నేతాజీ వంటి వారు ఆయుధాలు ధరించి విడివిడిగా యుద్ధాలు చేసి ప్రాణాలు విడిచారు కొందరు మితవాదులు కరపత్రాల ద్వారా నినాదాల ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినా ఫలితం శూన్యం లాల్ బాల్ పాల్ వంటి అతివాదులు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు కారణం విడివిడిగా పోరాడటమే ఆయుధం ధరించిన వాడు ఆయుధంతోనే మరణిస్తాడనే విషయం గ్రహించిన గాంధీజీ సత్యం అహింస శాంతి అనే ఆయుధాలు ధరించి డూ ఆర్ డై అనే నినాదంతో ప్రజలందరిలో స్వాతంత్య్ర కాంక్షను రగుల్కోపి ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపండంటు ఒకే ...