ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అక్షర యజ్ఞం




సరస్వతి శ్లోకం
వీణా పుస్తక ధారణి
విద్యా వరదాయిని
జ్ఞాన నేత్ర ప్రదాయిని
చదువులతల్లి సరస్వతి
అందుకో నాహృదయ పూర్వక అక్షరాంజలి
*****************************
వాణి
విధాతకు భార్యైన వాణి

మేనుకు కట్టిన ఓణీతో

మల్లెలు తురిమిన వేణితో

కంఠాభరణంలో ఒదిగిన మణులతో

కాళ్ళకు రాసుకున్న పారాణితో

ఒయ్యారపు నడకల తరంగిణిలా

మొగలి పువ్వులతో నమస్కరించింది ఫణికి

కచ్చపిని ధరించిన పాణితో

కమలమందు ఆశీనురాలైన రాణి

వినాయకుని స్తోత్రంతో చేసింది బోణి

సృష్టికర్తను మంత్ర ముగ్ధుల్ని చేసిన మధురవాణి

సంగీత సాహిత్యాలకు సామ్రాజ్ఞి

ఆ రాణియే నా వాణి సరస్వతి
*************************
అక్షరం విలువ
నిరక్షరాస్యులైన భార్యాభర్తలు
చాలీ చాలని కూలి డబ్బులతోను
దారిద్ర్యంతోను జీవనం సాగిస్తూ
పిల్లలు దేవుడిచ్చిన వరమంటూ
పెద్దలమాట చద్దిమూటగాభావిస్తూ
పిల్లల్నికనే యంత్రాలుగా మారి
అధిక సంతానాన్ని పొందినవారై
రెక్కాడితే గాని డొక్కాడని తల్లిదండ్రులు
పిల్లలకు కూడుగూడుగుడ్డ అందించలేక
చదువులు చెప్పించలేక
వైద్యసేవలందించ లేక
విధిచేతిలో కీలుబొమ్మలై
పిల్లల పోషణ భారమై
పిల్లల్ని పనిపాటలకు పంపిస్తూ
పిల్లల కూలి డబ్బులతో జీవనం సాగిస్తున్నారు 
పిల్లలు మాసినచిరిగిన బట్టలతో
చింపిరి జుట్టుతోబక్కచిక్కిన దేహాలతో
ఆకలి పొలి కేకలు పెడుతుంటే
కడుపు నిండే దారిలేక
ఇంటినికన్నవారిని వదలి
జానెడు పొట్టకై
పలక పట్టాల్సిన వయస్సులో
బిచ్చమెత్తే వారు కొందరు
చిత్తుకాగితా లేరుకునే వారింకొందరు
బాలనేరస్తులుగా మారేవారింకొందరైతే
దళారుల కబంధహస్తాలలో చిక్కి
మానప్రాణాలు పోగొట్టుకునే వారింకొందరు
వికలాంగులయ్యేవారింకొందరు
బిచ్చగాళ్ళగా మారేవారింకొందరు
నేటిబాలలే రేపటి పౌరులుకదా
నేడు ఇలా వుంటే రేపేమౌతారోకదా!
కాబట్టి చదువు విలువ తెలుసుకో
అక్షరాలు నేర్చుకో- బ్రతుకును చక్కదిద్దుకో
చిన్నకుటుంబం చింతలేని కుటుంబమని గ్రహించుకో.
**************************

చదువు విలువ తెలుసుకో

విద్యను నిర్లక్ష్యం చేస్తే
ప్రవర్తన గాడి తప్పి
లక్ష్యాన్ని ఛిద్రం చేసి
భవిష్యత్తును శూన్యం చేసి
కలల్ని కల్లలుగా చేసి
కళ్ళల్లో కన్నీరు నింపి
జీవితాన్ని కాలరాసి
కన్నవారి ఆశల నావను
నడి సంద్రమున ముంచేసి
అందరిలో చులకన చేసి
సమాజంలో పనికిరాని వాడిగా చేస్తుంది
*****************

చదవండి ఆచరించండి

నిన్ను నీవు గుర్తుంచుకో
చదువు విలువ తెలుసుకో 
ఉపాధ్యాయుడ్ని మార్గదర్శిగా తీసుకో 
తెలివి తేటల్ని పెంచుకో 
ఉత్తమ విద్యార్థిగా పేరుతెచ్చుకో 
భవిష్యత్తును ఉన్నతంగా మలుచుకో 
పొలంలో కలుపు మొక్కలవల్ల పంటనాశనం 
పాఠశాలలో కాపీలవల్ల విద్యార్థుల విద్యనాశనం 
కాపీలు వ్రాయటం నేరం 
కాపీలను ప్రోత్సహించటం మహానేరం
తస్మాత్ జాగ్రత్త విద్యార్ధులారా!

**************************

ఆచరించు చిన్నారి 

ప్రాతః సమయాన నిద్ర లేవమ్మ
పరిశుభ్రతను పాటించమ్మ
ధ్యానం చెయ్యమ్మ
మనోవికాసం కలుగునమ్మ
ఆటలు ఆడమ్మ
దేహదారుడ్యం పెరుగునమ్మ
విహార యాత్రలు చేయమ్మ
విజ్ఞానాన్ని పెంచుకోవమ్మ
మితాహారం భుజించమ్మ
ఆరోగ్యమే మహాభాగ్యమమ్మ
సామాజిక సేవలో పాల్గొనమ్మ
మానవసేవే మాధవ సేవమ్మ
చదువే అన్నిటికి మూలమమ్మ
చదువే జ్ఞానాన్ని ఇచ్చునమ్మ
చదువుకున్నవారికే విలువమ్మ
చదువుకున్నవారి మాటే వేదమమ్మ
చదువును నిర్లక్ష్యం చేయకమ్మ
శ్రద్ధగా చదువు కోవమ్మ
నీకో లక్ష్యనిర్దేశం ఉండాలమ్మ
నీలక్ష్యంకై పాటు పడాలమ్మ
నీ లక్ష్యం సాధించాలమ్మ
అందరికి ఆదర్శంగా నిలవాలమ్మ
అందరిచేత మన్ననలు పొందాలమ్మ
కన్నవారి కళ్ళల్లో ఆనందాన్ని నింపాలమ్మ
ఇవి ఒట్టి మాటలు కాదమ్మ
నీ భవితకు సువర్ణాక్షరాలమ్మ
****************

వెలుగు తగ్గిన అ ఆ ఇ ఈలు

ఇంగ్లీషు మోజులో పడిపోయి
కాన్వెంటు చదువులకు ఎగబడుతూ
వేలల్లో డొనేషన్లు కడుతూ
అఆఇఈలను వదిలేసి
ABCD లను దిద్దుకుంటూ
అరకొర ఆంగ్లంను నేర్చుకొనిరి
అమ్మా అన్నకమ్మని పిలుపును
మమ్మీగా మార్చి శవాన్ని చేసిరి
ఇకనైనా కళ్ళుతెరవండి
అఆఇఈలను నేర్పించండి
మాతృభాషను గౌరవించండి
దేశభాషలందు తెలుగు లెస్స అన్న
రాయల వారి మాట నిజం చేయండి
(13-9-O2 ఆంధ్రభూమి  మెయిన్ ఎడిషన్)
****************

లక్ష్యం

కోరికలను అదుపు చెయ్యి
మనసుకు కళ్ళెం వెయ్యి
పొగడ్తలకు లొంగబోకు
ఏకాగ్రతను వీడబోకు
విజ్ఞానమే నీ మూలధనమై
శ్రమయే నీ ఊతమైతే
విజయం నీ బానిసై
లక్ష్యం నీ పాదాక్రాంతమై
ఉన్నత శిఖరాలందుకుంటావు
(మార్చి 2012 విద్యోదయం మానపత్రిక)
********************

నా చిట్టితల్లీ. బంగారు తల్లీ.

ప్రాతఃసమయాన నిద్రలేవమ్మ  - చక్కగా ముస్తాబుకావమ్మ
దేవునికి పూజ చేయమ్మ- వడివడిగా బడికి వెళ్ళమ్మ
చకచకా పాఠాలు లు చదువుకోవమ్మ
ఆటపాటల్లో నీవు ముందుండవమ్మ
కొట్లాటలకు పోకమ్మ - స్నేహంగా మెలగాలమ్మ
ఈర్ష్యా అసూయలు వద్దమ్మ - మంచితనమే ముద్దమ్మ
కోపతాపాలొద్దమ్మ - శాంతమే మేలమ్మ
గేలి చేయకమ్మ - మాట పడకమ్మ
సాయంసంధ్యవేళ - ఇంటిపని చెయ్యాలమ్మ
బువ్వతినే వేళ - మారాము వలదమ్మ
నిద్రపోయేవేళ - నీతికథలు వినవమ్మ
నా మాటలాలకించవమ్మ - మంచిగా నడుచుకోవాలమ్మ
బంగారు తల్లంటూ - కీర్తి పొందాలమ్మ
అదిచూసి మేమంత గర్వపడాలమ్మ.
(25-11-2012 ఆంధ్రభూమి కృష్ణజిల్లా పేపరు)
********************

పసితనంపై విద్యాభారం

అమ్మబడిలో ఒదిగి కూర్చుంటూ
అమ్మ మాటలు వింటూ
గోరుముద్దలు తింటూ
బువ్వవద్దంటూ
మారాము చేస్తుంటే
కమ్మని పాటలు పాడుతుంటే
ఊ కొడుతూ ఉయ్యాలలో నిద్రిస్తుంటే
ఉలికిపాటుతో నిద్రలేస్తూ
చిన్నిచిన్ని కళ్ళతో
అమ్మని అన్వేషిస్తూ
చకచకా ఇల్లంతా పాకేస్తూ 
చిట్టి చిట్టి చేతులతో
టపటపమని చప్పట్ల చరుస్తూ
గట్టి గట్టిగా కేరింతలు కొట్టేస్తూ
అమ్మ చెయ్యందుకుంటూ
తప్పటడుగులేస్తూ
బుల్లి బుల్లి పాదాలతో
గబా గబా ఇల్లంతా నడిచేస్తూ
ముద్దు ముద్దు  మాటలతో
చిలిపి చేష్టలతో
పకపకా నవ్వుతూ అందరిని నవ్విస్తూ
బాల్య మాధుర్యాన్నిగ్రోలే చిన్నారిని
చదువు పేరుతో తల్లిదండ్రులు
బాల్యాన్ని మొగ్గలో తుంచేస్తూ
చదువనే కారాగారంలో పెట్టేస్తూ
మృధువైన చేతికి కలం అందిస్తూ
పేజీలకు పేజీలు అక్షరాలు దిద్దిస్తుంటే
చిలక పలుకులు పలికే నోటితో
పెద్ద పెద్ద పాఠాలు వల్లె వేయిస్తుంటే
బండెడు పుస్తకాల సంచిని
లేలేత భుజాలతో మోయిస్తుంటే
స్వేచ్ఛ స్వాతంత్రాలను హరిస్తుంటే
ఆటబొమ్మలా ఆటాడిస్తుంటే
చిన్నారులు చదువును కష్టంగా భావిస్తూ
చదువనే కర్మాగారంలో
మరమనుషులుగా జీవిస్తూ
చదువుల బండిని భారంగా లాగుతున్నారు.
(28-7-2013 ఆంధ్రభూమి, కృష్ణాజిల్లా )
***************************

విద్యాలయం

విద్యార్థికి మూలాధారం
జ్ఞాన,విజ్ఞాన భాండాగారం
మానసిక వికాసానికి ఆలయం
శారీరక దారుడ్యానికి  నిలయం
నేటి బాలల్ని రేపటి పారులుగా మార్చేది 
సమాజశ్రేయస్సు కాంక్షించేది
భావితరాలకు మేధావులనందించి
దేశ ఔన్నత్యాన్ని చాటేది
అజ్ఞానాన్ని పారద్రోలే అక్షర నిలయం
మన విద్యాలయం
విద్యార్థికి ఉండరాదు విద్యా నిర్లక్ష్యం
నిర్లక్ష్యానికి ప్రతిఫలం అజ్ఞానం
అజ్ఞానం ప్రగతికి అవరోధం
అందుకే ఓ విద్యార్థి మేలుకో
అక్షరం విలువ తెలుసుకో
అక్షరం అక్షరం నేర్చుకో
భవిష్యత్తును తీర్చిదిద్దుకో 
*********************

మోడు వారిన బాల్యం

కలి కాలంలో కామాంధుని వేట
కామాంధుల చేతిలో నలిగింది బాల్యం
మధువుమత్తులో మాటు వేసిరి
పసిపిల్లల్ని కాటు వేసిరి
రక్షకులే భక్షకులైరి
మమకారాన్ని మైలపర్చిరి 
మేలి ముసుగులో మాయచేసిరి
పసితనాన్ని గాయపర్చిరి
మానవత్వాన్ని మంట కల్పిరి
కన్నతల్లికి సిగ్గు తెచ్చిరి
పుడమి తల్లికి భారమైరి
రామ రాజ్యం పోయింది
కామాంధుల రాజ్యం వచ్చింది
(30-7-2001 వార్త జిల్లా పేపరు )
***********************

వీధి బాలలు

అక్రమ సంతానంగా జన్మించి
చెత్తకుండీలను పొత్తిళ్ళుగా చేసుకొని
చిరిగిన బట్టలు ఒంటికి చుట్టి
మురికివాడల్లో అడుగులు నేర్చి 
దేవుని ప్రసాదంతో కడుపునింపుకొని
కుళాయి నీళ్ళతో దాహం తీర్చుకొని
పార్కుల్లో నిద్రచేసి
ఆకలి తీర్చే అమ్మలు లేక
చింపిరి తలతో చేతులు చాపి
దారిద్ర్యంతో రోడ్డెక్కిన బాలలు
చీదరించుకున్నా వదిలిపోని అనాధలు
మనకు కనిపించే వీధి బాలలు
నాడు పూజకు పనికి రాని పువ్వులు
నేడు పారిజాతకుసుమాలు
దారిద్ర్యమే వీరికో సమస్య
వయసే వీరికి శాపం
విధి ఆడిన వింత నాటకంలో
ఆకలి తీరే దారిలేక
తోడేళ్ళకు ఆహారంగా మారి
జీవచ్చవాలుగా జీవిస్తూ
అంటురోగాలతో బాధపడుతున్నారు,
(12-8–2002 వార్త జిల్లా పేపరు )
****************

చీకట్లో చిరుదివ్వెలు

దారిద్ర్యంలో పుట్టి
కన్నవారికి భారమై
కూడుగుడ్డ కరువై
పలక పట్టాల్సిన  వయస్సులో
జానెడు పొట్టకోసం
హెూటళ్ళలో కప్పులు కడుగుతూ
వీధుల్లో చిత్తు కాగితాలేరుకుంటూ
పాల బుగ్గల్ని కొలిమిలోకాల్చేస్తూ 
రక్తాన్ని కార్థానాలో మరిగిస్తూ
మానవత్వంలేని యజమానుల క్రింద
కట్టు బానిసత్వం అనుభవిస్తూ 
పగలంతా వెట్టి చాకిరి చేస్తూ
రాత్రంతా ఫుట్పాత్లపై నిద్ర తీస్తూ
చేయూతనివ్వని సమాజంలో
జీవనం సాగిస్తున్నారు బాలకార్మికులు
****************

సోమరివాడు

సూర్యోదయంతో గుమ్మందాటి
చదువుకు నీవుటోపి పెట్టి
అల్లరిమూకతో చేతులు కలిపి
సప్తవ్యసనాలకు బానిసవై
కాసు కోసం దొంగవయ్యావు
పని పాటలు ప్రక్కనబెట్టి
ఆడపిల్లల్ని అల్లరి పెడుతూ
కన్నవారికి తలవంపులు తెస్తూ
సోమరిలా వీధుల్లో తిరుగుతూ
అర్థరాత్రివేళ ఇల్లు చేరావు
నీవు చేరబోయే గమ్యం
అడ్రస్సు లేని ఉత్తరం లాంటిది
మార్చుకో నీ జీవితం
లేకుంటే బ్రతుకే అంధకారం
*****************


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శతక లక్షణాలు, శతక కవులు

 శతక లక్షణాలు 1.సంఖ్యానియమం(100 to 108) శతకం అనగా 100 పద్యాలు,త్రిశతి  200లపద్యాలు, పంచశతి  500ల పద్యాలు,సప్తశతి  700ల పద్యాలు  2. మకుట నియమం( ఏకపద, అర్థపాద, ఏకపాద, ద్విపాద మకుటాలు)  3. రస నియమం( భక్తి, వైరాగ్యం, నీతి, శృంగారం)  4. ముక్తక నియమం : ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావం ఉండటం  5.ఛందో నియమం : వృత్త, జాతి, ఉపజాతి ఛందస్సు 6. ఆత్మాశ్రయభావన నియమం  7. ఉదాహరణలతో  వివరించటం  పద్యాలను బట్టి శతకాలను 15 రకాలుగా వర్గీకరించారు .1) భక్తి 2) శృంగార 3) నీతి  4) వేదాంత 5) హాస్య 6) చారిత్రక 7) కథా  8)చాటు 9) జీవిత చారిత్రక 10) స్వీయ చరిత్ర  11) వ్యజ్య నిందాస్తుతి 12) సమస్యాత్మక  13) నిఘంటు 14) అనువాద15) అచ్చ తెలుగు                    * శతక కవులు * 1.యథావాక్కుల అన్నమయ్య : 12వ శతాబ్దం   సర్వేశ్వర శతకం, మకుటం : సర్వేశ్వర  2.పాల్కురికి సోమన : 13వ శతాబ్దం,  వృషాధిప శతకం, రచనలు : బసవ పురాణం, బసవోదాహరణం, పండితారాధ్య చరిత్రం  3.బద్దెన :13వ శతాబ్దం, సుమతీ...

చెలి నీవెవరు

ముందుమాట " చెలి నీ వెవరు " అనే కవితా సంపుటి నిశీధివేళ ఒంటరిగా నేను స్వప్నంలో విహరిస్తుంటే మేలి జలతారు ముసుగులో తాను తారసపడి నాతో నడుస్తూ ఎన్నో ఊసులు చెబుతూ ఒంటరి తనాన్ని దూరంచేస్తూ నేనున్నానని బాస చేసి ప్రాతః సమయాన నన్ను నిద్రలేపి మాయమయ్యేది. తన మాటల్లోని భావాలను తన సుందర రూపాన్ని గుర్తు చేసుకుంటూ అరుణోదయాన అక్షరరూపం కల్పిస్తూ తనను కవితల్లో చూసుకుని మురిసిపోతూ నా దినచర్యను కొనసాగి స్తూ రాత్రి ఎప్పడౌతుందా అని ఎదురుచూస్తూ కనిపించని మనిషిని అన్వేషిస్తూ ఈ కవితా సంపుటిని వ్రాయటం జరిగింది. ఇట్లు , మీ యేటూరి మురళీకృష్ణ కుమార్ ********************************************** నేనెవరో తెలుసా పారే సెలయేరు నడుగు పండు వెన్నెల నడుగు చల్లగాలి నడుగు పరవశించే ప్రకృతి నడుగు గానానికి మైమరచిన గోవుల నడుగు గోవర్ధనగిరి నడుగు ఆరాధించే గోపికల నడుగు నన్ను ప్రేమించిన రాధ నడుగు అందరి ఆరాధ్య దేవుడిని నేను   మీ మురళీ కృష్ణుడిని నేను ***************************** చెలీ నీవెవరు ? నీ మోము చూస్తే పున్నమి నాటి చంద్రుడ్ని తలపిస్తోంది నీ నవ్వులోని స్...

దేశం - రాష్ట్రం - తెలుగు భాష ఔన్నత్యం

మన దేశం భారత దేశం మన దేశం శత్రు దుర్భేద్యమైనది భారతదేశం అలీన రధసారధి మన దేశం శాంతి సమానత్వ సౌభ్రాతృత్వం గలది మన దేశం లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం మన దేశం భిన్నత్వంలో ఏకత్వ స్వరూపమే మన దేశం చారిత్రక కట్టడాల నిలయం మన దేశం కళలకు పుట్టినిల్లు మన దేశం నవరసాల మేళవింపు మన దేశం పున్నమి నాటి చంద్రుని వంటిది మనదేశం మన దేశం భారత దేశం ------------------------------------------------------ ఈ దేశం మనది భారతదేశ దాశ్య శృంఖలాలు తొలగించడానికి సీతారామరాజు ఝాన్సీ లక్ష్మీబాయి ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి భగత్ సింగ్ నేతాజీ వంటి వారు ఆయుధాలు ధరించి విడివిడిగా యుద్ధాలు చేసి ప్రాణాలు విడిచారు కొందరు మితవాదులు కరపత్రాల ద్వారా నినాదాల ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినా ఫలితం శూన్యం లాల్ బాల్ పాల్ వంటి అతివాదులు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు కారణం విడివిడిగా పోరాడటమే ఆయుధం ధరించిన వాడు ఆయుధంతోనే మరణిస్తాడనే విషయం గ్రహించిన గాంధీజీ సత్యం అహింస శాంతి అనే ఆయుధాలు ధరించి డూ ఆర్ డై అనే నినాదంతో ప్రజలందరిలో స్వాతంత్య్ర కాంక్షను రగుల్కోపి ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపండంటు ఒకే ...